వర్ష బీభత్సం.. ఆలయంపై పడిన కొండచరియలు..9మంది మృతి..
X
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకుల వణికిపోతుంది. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని మరోసారి వర్షాలు మంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల ఇప్పటివరకు 250 మంది వరకు మరణించినట్లు సమాచారం. తాజాగా సిమ్లాలో ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా.. 20మందికి గాయాలయ్యాయి.
ఇవాళ ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్పకూలి పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి కోసం రెస్క్యూ చేపట్టారు.
ఇవాళ శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయం వద్ద దాదాపు 50మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం సఖ్విందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాలని ఆదేశించారు. కాగా గత
24 గంటల వ్యవధిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో సిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులపాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారలు ఇబ్బందులు పడుతున్నారు.