Ayodhya Ram Mandir : టెంపుల్ రన్.. అయోధ్యకు పోటీ పడుతున్న విమానయాన సంస్థలు
X
మరోవారం రోజుల్లో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగననుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీరాముని గుడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో అటు ప్రభుత్వాలు ఉండగా.. మరో పక్క ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విమాన సర్వీసులను ఏర్పాటు చేసే పనిలో దేశీయ విమానయాన సంస్థలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ కంపెనీలు అయోధ్యకు విమానయాన సేవలను అందించనున్నాయి.
డిసెంబరు 30న అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత.. ఇండిగో సంస్థ జనవరి 6 నుంచి ఢిల్లీ టూ అయోధ్యకు విమాన సర్వీసును ప్రారంభించింది. అలాగే అహ్మదాబాద్-అయోధ్య రూట్ ఫ్లైట్ కూడా ప్రారంభమైంది. అలాగే జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య మార్గంలో విమానాలను ప్రారంభించే యోచనలో ఉంది. మరో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా జనవరి 21న దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య మధ్య ప్రత్యేక విమానాన్ని నడపనుంది. అలాగే ఫిబ్రవరి 1 నుంచి అయోధ్యకు విమానయాన సంస్థ సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అలాగే చెన్నై నుండి ప్రతిరోజూ, ముంబై నుంచి వారానికి ఆరు సార్లు, బెంగళూరు నుంచి వారానికి నాలుగు సార్లు విమాన సేవలను నడపాలని నిర్ణయించింది.
ప్రస్తుతం టాటాల యాజమాన్యంలో నడుస్తున్న ఎయిర్‌లైన్ కంపెనీ జనవరి 17 నుంచి అయోధ్యకు.. బెంగళూరు, కోల్‌కతా నుంచి విమానాలను నడపనుంది. అలాగే అయోధ్య-ఢిల్లీ మధ్య విమాన సర్వీసును ప్రారంభించారు. ఇదిలా ఉండగా అయోధ్యలోని పవిత్ర కార్యక్రమానికి వీఐపీలు వస్తున్న తరుణంలో దాదాపు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 59.97 లక్షల నుంచి 2022-23 నాటికి 96.02 లక్షలకు చేరుకున్నట్లు వెల్లడించారు.