రోజుకు రెండుసార్లు శివలింగం మాయం..200 ఏళ్ల చరిత్ర!
X
ప్రపంచ వ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన దేశంలో పురాతన శివాలయాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. అయితే ప్రతి ఆలయానికి సంబంధించి ఒక సొంత పురాణ చరిత్ర అనేది ఉంటుంది. కానీ పగటిపూట మాయం అయ్యే భోలేనాథ్ ఆలయం గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సముద్ర కెరటాలే ఇక్కడి శివలింగాన్ని అభిషేకిస్తాయి. రోజుకు రెండు సార్లు శివలింగం అదృశ్యమవుతుంది.
మాయమవుతున్న ఆలయం
ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భరూచ్ జిల్లా సముద్రతీరంలో ఈ శివలింగం దర్శనమిస్తుంది. రోజుకు రెండుసార్లు దాని స్థలం నుంచి ఈ ఆలయం అదృశ్యమవుతుంది. అందుకే ఈ ఆలయాన్ని మాయమవుతున్న ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం సముద్రపు ఒడ్డున ఉండటం వల్ల అలలు ఎగసిపడినప్పుడు ఆలయం మొత్తం సముద్రంలో మునుగుతుంది. దీంతో అలలు తగ్గిన తర్వాతే ఇక్కడి శివుడికి భక్తులు పూజలు చేస్తారు.
ఆలయ చరిత్ర ఇదే
ఆలయానికి సంబంధించి స్కంద పురాణంలో రాసి ఉంది. తారకాసురుడు శివుని కోసం కఠిన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. చావులేని వరం ఇస్తాడు. అయితే ఆరునెలలలోపు పిల్లలే తారకాసురుడిని చంపగలరనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరాన్ని పొందిన తారకాసురుడు రెచ్చిపోతాడు. దేవతలను, రుషులను చంపేస్తుంటాడు. దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్లి తమ బాధను చెప్పుకుంటారు. అప్పుడే 6 రోజుల వయస్సు ఉన్న కార్తికేయ జన్మించి తారకాసురుడిని చంపుతాడు. ఆ రాక్షసుడిని చంపిన ప్రదేశంలోనే ఈ శివాలయాన్ని నిర్మించారు. దేవతలు మహిసాగర్ సంగమ తీర్థంలో విశ్వానందక స్తంభాన్ని ప్రతిష్టిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పిలుస్తారు.