Sabarimala Ayyappa Temple, : మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. దర్శన వేళలివే
X
శబరిమల అయ్యప్ప స్వామికి మాసి మాస పూజను నిర్వహించనున్నారు. ఇందుకోసం అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెరిచి శుద్ధి చేశారు. అయితే భక్తులకు మాత్రం ఈ రోజు నుంచి దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి ఐదు రోజుల పాటు శబరిమల ఆలయ దర్శనం ఉంటుందని అధికారులు ప్రకటించారు.
భక్తుల దర్శనాల నిమిత్తం కేవలం 5 రోజులు మాత్రమే ఆలయం తెరచి ఉంటుందన్నారు. ఈ ఐదు రోజుల్లో అయ్యప్పను దర్శించుకోవడానికి ఆన్ లైన్ బుకింగ్ కచ్చితంగా చేసుకోవాలని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. బుకింగ్ లేనివారికి దర్శనాలు కల్పించబోమని తేల్చి చెప్పింది. ఈ నెల 18వ తేది వరకూ మాసి మాస పూజలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల దర్శనాల కోసం ఆన్ లైన్లో బుకింగ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ నిర్విరామంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.
ఆలయం తెరిచి ఉంచే ఈ 5 రోజుల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 5 గంటలకు నెయ్యి అభిషేకంతో పూజను ప్రారంభించారు. 18వ తేది వరకూ రాత్రి 7 గంటలకు అయ్యప్పకు పడిపూజను నిర్వహించనున్నారు. అలాగే ఆ రోజే రాత్రి సమయంలో నిత్యపూజలు చేసిన తర్వాత హరివరాసనం ఆలపించి అయ్యప్ప ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు. ఈ పూజలకు కేరళ నుంచే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలు తరలి వస్తారు.