ప్రభుత్వానికి బీసీసీఐ కడుతున్న ట్యాక్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X
భారతదేశంలో ఎక్కువగా ఆడే, చూసే ఆట క్రికెట్. ఈ కారణంగానే ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ కొనసాగుతోంది. ఇక ప్రతి సంవత్సరం బోర్డు ఆదాయం పెరుగుతూనే ఉంది. వివిధ మార్గాల్లో బీసీసీఐ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వాటిలో ప్రధానంగా మ్యాచ్ ల ప్రసార హక్కులను అమ్మడం, జెర్సీ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్ మొదలైన వివిధ స్పాన్సర్ లతో నుంచి ఆదాయం సమకూరుతోంది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ వంటి లీగ్స్ రాకతో బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చి చేరుతోంది. ఇలా వేల కోట్లు సంపాదించే బీసీసీఐ ప్రభుత్వానికి కట్టే పన్నుపై పార్లమెంట్ లో ఓ సభ్యుడు ప్రశ్నలు లేవనెత్తాడు. బీసీసీఐ ప్రభుత్వానికి పన్నురూపంలో ఎంత చెల్లిస్తోంది చెప్పాలని కోరాడు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
గడిచిన ఐదేళ్లకు సంబంధించి ఆదాయం, ఖర్చులతో పాటు పన్నుల వివరాలను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో రూ.1159 కోట్లను ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లించిందని మంత్రి తెలిపారు. అంతకుముందు ఏడాది కంటే ఇది 37 శాతం అధికం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్లు బీసీసీఐ చెల్లించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్లు,2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.882.29 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బీసీసీఐ ఆదాయపన్ను రూపంలో చెల్లించినట్లు మంత్రి తెలిపారు.