International Kite Festival : జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్
X
జనవరి 13 నుంచి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్బంగా బేగంపేట్ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషన్ కైట్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కైట్ ఫెస్టివల్ ను తూతూ మంత్రంగా కాకుండా ఈసారి ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఫెస్టివల్ ను నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 13 నుంచి జనవరి 15 వరకు మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 16 దేశాల నుంచి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, 60 మంది దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొననున్నారు. పలు డిజైన్లలో రూపోందించిన పతంగులను ఫ్లయర్స్ ఎగుర వేస్తారని తెలిపారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను అక్కడి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వీటిని నిర్వహిస్తామని ఆయన అన్నారు.