Home > జాతీయం > మేం అంటరానివాళ్లమా.. విపక్షాలపై ఎంఐఎం ఫైర్

మేం అంటరానివాళ్లమా.. విపక్షాలపై ఎంఐఎం ఫైర్

మేం అంటరానివాళ్లమా.. విపక్షాలపై ఎంఐఎం ఫైర్
X

బెంగళూరులో 26 విపక్షాలు నిర్వహించిన సమావేశంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ మండిపడింది. ఈ సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదని ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ ప్రశ్నించారు. రాజకీయంగా వారికి మేం అంటరానివారమా అని అన్నారు. ఆ నేతలు తమను పిలవలేదని, వారికి ముస్లింల ఓట్లు కావాలి గానీ వారి రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం అక్కర్లేదని ఆయన ఆరోపించారు.

సెక్యులరిజం గురించి మాట్లాడే మీరంతా.. ఎన్నికల సమయంలో సమావేశమైనప్పుడు తమను మాత్రం ఎందుకు పరిగణనలోకి తీసుకోరని పఠాన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. బీజేపీతో ఒకప్పుడు అంటకాగిన నితీష్ కుమార్, ఉద్ధవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీ కూడా బెంగళూరు మీటింగ్ కు హాజరయ్యారు.. వారిప్పుడు హఠాత్తుగా సెక్యులర్ అయ్యారు అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించారని, కానీ ఆయనను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారని పఠాన్ చెప్పారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, బీజేపీని ఓడించాలని ప్రతిపక్ష నేతలు అంటున్నారని, తాము కూడా ఇదే చెబుతున్నామని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తాము కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మోడీ మళ్ళీ ప్రధాని కాకూడదని తాము సైతం కోరుతున్నామని చెప్పారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని విపక్షాలు గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు.

Updated : 19 July 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top