Disqualification case: ఎన్నికల్లో ఇద్దరు నేతల ఓటమిపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు
X
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాద, ప్రతివాదులిద్దరూ ఓటర్ల ముందుకు వెళ్లడానికి బదులు తమ శక్తినంతా కోర్టుల్లో ధారపోయడంతో ఎన్నికల్లో ఓడిపోయినట్లున్నారని అని తెలిపింది. గత ఏడాది వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వనమా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వనమా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘వనమా వెంకటేశ్వరరావు కాలపరిమితి ముగిసిపోయింది. తాజా ఎన్నికల్లో వనమా, జలగం ఇరువురూ ఓడిపోయారు. అందువల్ల ఈ కేసులో విచారణ సాగించడం వృథా’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. కేసులోని వాద, ప్రతివాదులిద్దరూ ఓటర్ల ముందుకు వెళ్లడానికి బదులు తమ శక్తినంతా న్యాయస్థానంలో ధారపోయడంతో ఎన్నికల్లో ఓడిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను వనమా అనుచితంగా ప్రభావితం చేసినట్లు హైకోర్టు తీర్పులో ఉందని, దాన్ని తొలగించాలని వనమా తరఫు న్యాయవాది కోరారు. వనమా తరపు న్యాయవాది వాదనలపై జలగం వెంకట్రావు తరపు న్యాయవాది శేషాద్రినాయుడు అభ్యంతరం తెలిపారు.
హైకోర్టు తీర్పు ప్రకారం .. పదవీకాలం ముగిసినప్పటికీ ఆరేళ్లు అనర్హత వేటు వేయాల్సిన నిబంధనలు ఉన్నాయని దాని ప్రకారం వనమా వెంకటేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలని జలగం తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వనమా అవినీతికి పాల్పడినట్లు నిరూపణ అయిందా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించగా.. అవునని శేషాద్రినాయుడు బదులిచ్చారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం వల్ల వనమాకు వ్యతిరేకంగా సెక్షన్ 99 ప్రొసీడింగ్స్‌ను ఎన్నికల సంఘం చేపట్టలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాదనలను విన్న అనంతరం కేసు తదుపరి విచారణను నాన్‌మిసిలేనియస్ డేకి ధర్మాసనం వాయిదా వేసింది.