Budget 2024-25 : నేడే బడ్జెట్..పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
X
సార్వత్రిక ఎన్నికల ముందు..మోదీ సర్కార్ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024-25 బడ్జెట్‌కు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల తర్వాత గెలిచిపన కొత్త సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్ ను తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో మరి చెప్పుకోదగ్గ నిర్ణయాలేవీ ఉండవు! అయితే వచ్చే ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ సర్కార్.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ఆకర్షించేందుకు మధ్యంతర బడ్జెట్ లో కొన్ని వరాలు కురిపించే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ఇన్ని ఏండ్లుగా పెంచిన ధరలు, పెరిగిన రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికీ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. గత పదేళ్లలో బీజేపీ సర్కారు సాధించిన విజయాలు...భవిష్యత్తులో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నదీ నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్ తో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.