Home > జాతీయం > Ayodhya Ram Statue Photo : 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే

Ayodhya Ram Statue Photo : 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే

Ayodhya Ram Statue Photo : 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే
X

అయోధ్య రామమందిరంలో కొలువుదీరబోయే బాలరాముడి విగ్రహం తాలుకూ చిత్రాలు ప్రాణ ప్రతిష్ఠకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 18 న బాలరాముడి విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య రామ మందిరం గర్భగుడిలోకి చేర్చారు. గర్భగుడిలో కళ్లకు గంతలు కట్టి ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు ఇదివరకే బయటకురాగా తాజాగా గర్భగుడిలో చేర్చకుముందు కళ్లకు గంతలు లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. బాల రాముడి చేతిలో బంగారు విల్లు, బాణాలు ఉన్నట్లు ఆ చిత్రాల్లో ఉంది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున ఆలయానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు.. ‘జై శ్రీరాం, జైశ్రీరాం’ అంటూ పులకించిపోతున్నారు.

51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువుతో నల్లని రూపంలో రామయ్య విగ్రహం ఉంది. కమలంపై నిల్చున్న బాలరాముడి ఫొటోను చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. విష్ణుమూర్తి దశావతారాలు సహా ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్‌, హనుమ, గరుడను విగ్రహం చుట్టూ ఉండేలా అద్భుతంగా బాలరాముడి విగ్రహాన్ని మలిచారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్‌ గుర్తు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని మలిచారు. రామయ్య నిజరూపమే ఇంత అద్భుతంగా ఉంటే.. ఆభరణాలు, విల్లు ధరించాక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందోనని భక్తులు అంటున్నారు. ఈ నెల 18 న గురువారం అయోధ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేదమత్రోచ్చరణల మధ్య జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే.. ఈరోజు ప్రాణప్రతిష్ట అనంతరం రామయ్యను అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated : 22 Jan 2024 9:40 AM IST
Tags:    
Next Story
Share it
Top