Home > జాతీయం > BIHAR: పోలీస్‌ స్టేషన్‌లో దొంగలుపడ్డారు.. సరుకంతా దోచుకెళ్లారు

BIHAR: పోలీస్‌ స్టేషన్‌లో దొంగలుపడ్డారు.. సరుకంతా దోచుకెళ్లారు

BIHAR: పోలీస్‌ స్టేషన్‌లో దొంగలుపడ్డారు.. సరుకంతా దోచుకెళ్లారు
X

సీజ్ చేసిన లిక్కర్ బాటిళ్లన్నింటిని పోలీస్ స్టేషన్‌లో భద్రంగా దాచి ఉంచారు పోలీసులు. ఈ విషయం స్థానికంగా ఉండే ఓ దొంగకి తెలిసింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ దొంగ.. మరో వ్యక్తితో కలసి... పోలీసుల కళ్లు గప్పి మరీ ఆ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అర్ధ రాత్రిపూట స్టేషన్ లో ఎవరూ లేరని గ్రహించి.. ముందుగా వేసుకునన ప్లాన్ ప్రకారం.. స్టేషన్ గోడకు కన్నం వేసి మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి (సెప్టెంబర్‌ 22) చోటుచేసుకుంది.

బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉండగా.. పలు చోట్ల మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేసి భారీ మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ముజఫర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 22) భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసులందరూ ఒకే చోటకు చేరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దొంగలు పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న స్టోర్‌ రూం గోడ పగులగొట్టి ఐదు బాక్సులు, బ్యాగ్‌ నిండా మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు.

ఆ మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులే షాక్ అయ్యారు. స్టోర్‌ రూంలో భద్రపరచిన మద్యం సీసాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. తాము స్టేషన్‌లో ఉండగానే చోరీ ఎలా జరిగిందంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.. ఎవరు ఇదంతా చేశారనే దానిపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా.. శుక్రవారం రాత్రి నుంచి భోలా కుమార్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని గుర్తించారు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గంటల వ్యవధిలో ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం రాత్రి తన సహచరుడితో కలిసి చాకచక్యంగా పోలీస్‌ స్టేషన్‌ గోడ దూకి లోనికి ప్రవేశించామని, ఉలి, రాడ్‌తో వెంటిలేటర్‌ను పగలగొట్టి గోడకు రంధ్రం చేసి స్టోర్‌ రూంలోకి ప్రవేశించినట్లు తెలిపాడు. చోరీ చేసిన మద్యం బాటిళ్లు మరుసటి రోజు మద్యం మార్కెట్‌లో విక్రయించాలనుకున్నామని.. కానీ ఈలోపే దొరికిపోయానని చెప్పాడు. మొత్తం 56 లీటర్ల మద్యం చోరీ అవ్వగా.. 32 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Updated : 25 Sep 2023 3:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top