IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు బెదిరింపు మెసేజ్
X
ప్రపంచకప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలో వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని, 2019 వరల్డ్ కప్ లో జరిగింది రిపీట్ కావొద్దని ఆశిస్తున్నారు. కివీస్ పై ప్రతీకారం తీర్చుకుని సగర్వంగా ఫైనల్స్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ కు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో ఘోరం జరుగుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు మెసేజ్ పంపించాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
‘ట్విట్టర్ లో అన్నోన్ అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపించాడు. వాంఖడే స్టేడియంలో ఘోరం జరుగుతుందని చెప్పాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్స్, బుల్లెట్ల ఇమోజీలు పంపించాడు. అందుకే భద్రత కట్టుదిట్టం చేశామ’ని ముంబై పోలీసులు తెలిపారు. కాగా టీమిండియా మ్యాచ్ లకు బెదిరింపులు రావడం ఇదేం కొత్త కాదు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. అహ్మదాబాద్ స్టేడియానికి బెదిరిపు మెయిల్ రావడంతో పోలీసులు భద్రతను పెంచారు. తర్వాత నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కాగా ఈ వార్త తెలిసిన అభిమానులు కలవర పడుతున్నారు. ఆనందంగా మ్యాచ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. బెదిరింపు న్యూస్ షాక్ ఇచ్చిందని చెప్తున్నారు.