Manipur violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి
X
తెగల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేడింది. శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో మరో ముగ్గురు అమాయకులు తూటాలకు బలయ్యారు. ఉఖ్రుల్ జిల్లాలో సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ గ్రామంపై ఈ దాడి జరిగిందని జిల్లా పోలీసు అధికారి ఎన్ వాషుమ్ తెలిపారు. ఉదయం 4.30 గంటల సమయంలో సాయుధ మూకలు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయని వెల్లడించారు. ఈ ఘటనలో తోవాయి గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారని చెప్పారు. కాల్పుల సమాచారం నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. వారంతా 24 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారని పోలీసులు తెలిపారు. పదునైన కత్తులతో హత్య చేశారనీ.. చంపడానికి ముందు అవయవాలను నరికినట్లు పోలీసులు తెలిపారు. హింస నేపథ్యంలో గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడ్డవారిని గుర్తించి, పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని ఎస్పీ వాషుమ్ వెల్లడించారు.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు మూడు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు కదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణిస్తున్నాయి. ఈ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో సుమారు 180 మందికి పైగా మరణించారు. అనేక మంది కనిపించకుండా పోయారు.