గత పదేళ్లలో ఇదే పెద్ద రైలు ప్రమాదం
X
శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. సిగ్నల్స్‌లో గందరగోళం నెలకొనడంతో ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో 233 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 1400 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 150కిపైగా అంబులెన్సులు సేలవలు అందిస్తున్నాయి. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యానికి చేరవేస్తున్న రైల్వే శాఖ, ప్రయాణికుల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ ఎందుకీ ఘోరం జరిగిందని దేశం నివ్వెరపోతోంది. ఈ ఘోరం ఎలా జరిగిందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాలలో అతిపెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం.ఇదే క్రమంలో ఈ దశాబ్ద కాలంలో జరిగిన భారీ రైలు ప్రమాదాల గురించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.
హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ :
ఆంధ్రప్రదేశ్ సమీపంలో 2012 మే 22న హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్, ఓ కార్గో రైలును ఢీకొనడంతో 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘోర ప్రమాదంతో రైలులో పెద్ద ఎత్తున మంటలు చెరరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరో 43 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ :
2014 మే 26న ఘోరమైన రైలు ప్రమాధం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న సమయంలో ఖలీలాబాద్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 25మంది ప్రయాణికులు మరణించారు. రైలులో ప్రయాణిస్తున్న మరో 50మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ :
రైల్వే చరిత్రలో అత్యంత ఘోర రైలు ప్రమాదంగా ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నిలుస్తుంది. 2016 నవంబర్ 20న జరిగిన ఈ ప్రమాదంలో 150 ప్రయాణికులు చనిపోయారు. మరో 150 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లో పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కైఫియత్ ఎక్స్‌ప్రెస్ :
2017 ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా సమీపంలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక డంపర్ రైలు కంచెను బద్దలు కొట్టి, కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఢిల్లీ-హౌరా మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పురి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ :
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం దురదృష్టకర సంఘటనలో ఒకటిగా నిలుస్తుంది. పూరీ హరిద్వార్ కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ సమీపంలోని ఖతౌలీ పట్టణంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 14 కోచ్‌లు ట్రాక్ తప్పడంతో 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. 2017 ఆగస్ట్ 18న ఈ ఘోర ప్రమాదం జరిగింది.
బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ :
ఉత్తర బెంగాల్‌లోని న్యూ దోమోహని, న్యూ మేనాగురి రైల్వే స్టేషన్‌ల మధ్య బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని పలు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 1053 మంది ప్రయాణికులు ఉన్నారు. 2022 జనవరి 13న ఈ రైలు ప్రమాదం జరిగింది.
ఒడిశా రైలు ప్రమాదం :
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో అపార ప్రాణనష్టం సంభవించింది. 233 మంది చనిపోగా వెయ్యిమందికిపైగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతులకు నివాళిగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. మృతుల్లో అత్యధికం పశ్చిమ బెంగాల్ వాసులే ఉన్నారు. బాలేశ్వర్ జిల్లాలోని బాలేశ్వర్ సమీపంలో బజార్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌడాకు వెళ్తున్న బెంగళూరు-హౌడా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏడున్నర గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చాలా బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయాయి. అదే సమయంలో చెన్నై వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అటుగా దూసుకొచ్చి వాటిని ఢీకొట్టింది. కోరమాండల్ రైలుకు చెందిన 15 బోగీలు పక్కపట్టాలపై బోల్తాపడ్డాయి. వాటినిపై ఓ గూడ్సు రైలు ఢీకొంది. రెండు ప్రయాణికుల రైళ్లు, ఒక గూడ్సు రైలు చెల్లచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. ఆర్తనాదాలతో దద్దరిల్లింది.