MP Mahua Moitra: బయటి వ్యక్తికి పార్లమెంటు లాగిన్, పాస్‌వర్డ్‌లు.. మహిళ ఎంపీపై ఆరోపణలు
X
నేషనల్ వైడ్‌గా పాపులర్ అవ్వాలంటే.. ప్రధాని మోడీని పర్సనల్‌గా టార్గెట్ చేయడమే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకి బెస్ట్ ఆప్షన్ అని ఆమె ఫ్రెండ్స్ సూచించనట్లు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది.
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో ఆమె పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారనీ, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిని మహువా మొయిత్రా ఖండిస్తూ.. దీనిపై విచారణకు కూడా తాను సిద్ధమే అని చెప్పారు. అయితే తాజాగా బిజినెస్‌మన్ దర్శన్ హీరానందానీ గురువారం ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు.
అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రశ్నలు గుప్పించడానికి మహువా డబ్బులు తీసుకున్నారని హీరానందానీ దాదాపు అంగీకరించారు. అదానీపై ప్రశ్నలను రూపొందించేందుకు ఆమె తన పార్లమెంటు లాగిన్ ఐడీని, పాస్‌వర్డ్‌ను తనకు ఇచ్చారని తెలిపారు. దీని కోసం తమకు పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, అదానీ కంపెనీల్లో గతంలో పని చేసిన ఉద్యోగులు సహకరించారని తెలిపారు. ఆమె తన వద్ద విలువైన వస్తువులను కూడా తీసుకున్నారని, ప్రతిపక్షాలు పరిపాలించే రాష్ట్రాల్లో తన వ్యాపారానికి ఆమె ద్వారా సహకారం అందుతుందనే ఉద్దేశంతోనే తాను ఆమెకు సహకరించానని తెలిపారు. ఈ వివరాలను ఆయన అఫిడవిట్ రూపంలో సమర్పించారు