Toll Gates : వాహనదారులకు శుభవార్త.. ఇకపై ఫాస్టాగ్‌తో పనిలేదు!
X
హైవేలపై వాహనదారుల సమస్యలు తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా వాహనదారులకు టోల్ గేట్ల వద్ద కాస్త ఆలస్యం అవుతూ ఉంటోంది. ఎక్కువ సమయం క్యూలో ఉండి టోల్ గేట్ వద్ద పేమెంట్ చేశాక ఆ తర్వాత బయల్దేరాల్సి ఉంటుంది. దీనివల్ల సమయం చాలా వరకూ వృథా అవుతోంది. కొన్ని సమయాల్లో సర్వర్ మొరాయించడం, టెక్నికల్ సమస్యలు వచ్చి టోల్ గేట్ల నగదును ఆన్‌లైన్‌లో చెల్లించలేకపోతారు. ఆ టైంలో ఆఫ్‌లైన్‌లోనే ఫాస్టాగ్ నగదు కట్టి రావాల్సి ఉంటుంది. దానివల్ల గంటల తరబడి ఆలస్యం అవుతుంటుంది. అయితే ఇకపై ఆ సమస్య రాదు.
వాహనాలతో టోల్ గేటులు రద్దీగా మారుతున్నాయి. ఈ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నేపథ్యంలో వారికి ఓ శుభవార్తను చెప్పారు. రాబోయే రోజుల్లో హైవే టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దేశంలోని పలు హైవేలపై ఆ సిస్టమ్‌ను కొన్నిచోట్ల అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్స్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్స్‌ను నియమించుకోనుంది. దీనివల్ల ట్రాఫిక్ తగ్గించడంతో పాటుగా హైవేలపై ప్రయాణించే కచ్చితమైన దూరానికి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం టోల్ ఆదాయం ఏటా రూ.40 వేల కోట్లు వస్తోందని, మరో మూడేళ్ల కాలంలో రూ.1.40 లక్షల కోట్ల ఆదాయాన్ని టోల్ ద్వారా వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు. అందుకోసమే ఈ కొన్ని విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.