ఓవర్సీస్‌లో రెచ్చిపోయిన టాలీవుడ్ ఫ్యాన్స్.. థియేటర్‌లో రచ్చ.. చివరకి..
X
సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్‌లో సినిమాల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పండుగ ముందురోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', తేజ సజ్జా-ప్రశాంత్ వర్మల 'హనుమాన్ రిలీజ్' కాగా.. ఆ తర్వాత వరుసగా సీనియర్ హీరోలు వెంకటేశ్ 'సైంధవ్', నాగార్జున 'నా సామిరంగా' విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలూ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మూవీ లవర్స్ అంతా ఈ పండుగను సరికొత్త సినిమాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవిదేశాల్లో కూడా మన తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఓవర్సీస్ లో మన సినిమాలకు మంచి మార్కెట్ ఉండడంతో.. ఆయా చిత్ర నిర్మాతలు అక్కడా కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ మధ్య ఓవర్సీస్ లో కూడా కొంతమంది ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అత్యుత్సాహంతో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారు. గతేడాది వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శన సమయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో రచ్చ కాలిఫోర్నియాలో జరిగింది. కాలిఫోర్నియాలోని సినీమార్క్‌లో టాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఈ సినిమా చూసేందుకు భారీ స్థాయిలో ఎగబడ్డారు. టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్లలోకి వెళ్లిన కొంతమంది.. సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా.. కేకలు, ఈలలు వేసి నానా హడావుడి చేశారు. వింత వింత శబ్ధాలు చేస్తూ సినిమా థియేటర్‌ని కాస్త ఏదో సంతలా మార్చారు.
ఈ హడావుడితో థియేటర్ యాజమాన్యం సీరియస్ అయింది. నడుస్తున్న సినిమాను మధ్యలోనే ఆపేసి.. స్క్రీన్ ముందుకు వచ్చిన మహిళా నిర్వాహకులు ఒకరు మనోళ్లకు గట్టి వార్నింగే ఇచ్చారు. సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు మర్యాదగా నడుచుకోవాలని, థియేటర్లోని స్క్రీన్ ధర 65 వేల డాలర్లని , మిగతా ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం ఇవ్వాలని , కాస్త కామన్ సెన్స్ వాడాలని సలహా ఇచ్చారు. తాము ఒక్కసారి థియేటర్ నుంచి వెళ్లగొడితే మళ్లీ లోపలికి రాలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అలా బయటి దేశాల్లో కూడా కొందరు పరువు తీస్తున్నారని, ఒకరితో చెప్పించుకోవడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.