Home > జాతీయం > అన్నదమ్ముల్ని లక్షాధికారుల్ని చేసిన టమాటా పంట

అన్నదమ్ముల్ని లక్షాధికారుల్ని చేసిన టమాటా పంట

అన్నదమ్ముల్ని లక్షాధికారుల్ని చేసిన టమాటా పంట
X

గత కొద్ది రోజులుగా టమాటాల రేట్లు, అవి పండించిన రైతులకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగి కిలో టమాటా రూ. 120 నుంచి రూ. 200 వరకు పెరిగిపోయింది. ఒక్కో చోట ట్రిపుల్ సెంచరీ వరకూ వెళ్లింది. దీంతో ఆరుగాలం శ్రమించి టమాటా సాగు చేసిన రైతులు రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల రైతులు.. టమాటా సాగుపై వచ్చిన డబ్బుతో ఉన్న అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చేస్తున్నారు. లగ్జరీ ఇళ్లు, వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. అప్పటి వరకూ వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వం అన్నవాళ్లు కాస్త.. మా అమ్మాయిని చేసుకోండి అంటూ యువరైతుల ఇంటికి కబుర్లు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా టమాటా సాగుతో.. లక్షలు గడించారు. చదువు, సంధ్య లేకుండా పొలం పనులు చేసుకుంటున్నారన్న ఆ ఊరి వాళ్ల నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. ఫలితంగా ఆ యువ రైతులను వారు పండించిన టమాటా పంట సమాజంలో తలెత్తుకునేలా చేసింది.

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా లక్ష్మీపురకు చెందిన రాజేశ్‌, నాగేశ్‌ అనే అన్నదమ్ములు టమాటా సాగు చేసి లక్షాధికారులుగా ఎదిగారు. మూడేళ్ల కిందటే వీరిద్దరూ చదువు మానేసి.. తమకున్న 2 ఎకరాల పొలంలోనే వ్యవసాయ పనుల్లోకి దిగారు. టమాటాకు చక్కని ధర వస్తుందని ఊహించి, తమ పొలం పక్కనే గత ఏడాది మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. మొత్తం 12 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. పంట దిగుబడితో పాటు ధర కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు 2 వేల బాక్సుల టమాటా విక్రయించి..రూ.40 లక్షలకుపైగా ఆదాయాన్ని గడించారు. తమకు మద్దతుగా తల్లిదండ్రులు కూడా పొలంలో పని చేస్తూ సహకారం అందించారని రాజేశ్‌ పేర్కొన్నారు. రాత్రుళ్లు పంటకు తన సోదరునితో కలిసి వంతుల వారీగా కాపలా కాస్తున్నానని తెలిపారు. గతంలో తమ కుటుంబం పేరిట ఉన్న అప్పులన్నీ ఒక్క పంటతోనే తీరిపోయాయని ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా రాజేష్‌ కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయడం కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అయితే చదువుకున్న, ఉద్యోగంలో బాగా సెటిల్‌ అయిన అబ్బాయే కావాలని అమ్మాయిల తరపు వాళ్లు తెగేసి చెప్పడంతో రాజేశ్ కు సంబంధం దొరకడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్‌... ఎలాగైనా భవిష్యత్తులో గట్టిగా ఎదగాలని.. ధైర్యం చేసి మొత్తం 12 ఎకరాల పొలంలో టమాటా సాగు చేశాడు. ఫలితంగా పండించిన టమాటాకు బంపర్ ధర పలికింది. గత ఆరు నెలల్లో క్రమంగా టమాటా వ్యాపారం కారణంగా అతనికి రూ. కోటి ఆదాయం అందింది. వ్యక్తిగత రుణాలు, బ్యాంకు రుణాలు, ఖర్చులు అన్నీ పోగా మిగిలిన సొమ్ములో కొంత పొదుపు చేసుకున్నారు. రూ. 25 లక్షలతో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేశారు. దీంతో వ్యవసాయం చేసే వారికి పిల్లను ఇవ్వబోం అనే వారికి గట్టి సమాధానం చెప్పాలని అనుకున్న రాజేష్‌ సంకల్పం ఫలించడంతో అతను ఆనందలో మునిగి తేలుతున్నాడు.




Updated : 8 Aug 2023 8:29 AM IST
Tags:    
Next Story
Share it
Top