రేషన్ షాపుల్లో రూ.60కే టమాటా..నేటి నుంచే అమలు
X
దేశంలో టమాటా ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఆకాశనంటుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా ధర సెంచరీ క్రాస్ చేసి రూ.120 నుంచి 150 పలుకుతోంది. ధరలు పెరుగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లో టమాటాల వైపు కన్నెత్తికూడా చూడడం లేదు. దీంతో ధరల నియంత్రణ పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
కిలో రూ.60 కే..
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమాటా ధరలను కేజీ రూ.60కే అందించున్నట్లు ప్రకటించింది. జూలై 4వ తేది నుంచి రేషన్ షాపుల్లో రూ.60కే విక్రయించనున్నట్లు వెల్లడించింది. మొదటగా . దక్షిణ చెన్నై, సెంట్రల్ చెన్నైగా విభజించి మొత్తం 82 రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున అమ్ముతారు. అనంతరం ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. టమాటా ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లను పెంచిందని మంత్రి పెరియకురుప్పన్ తెలిపారు. వినియోగదారులు, రైతులు నష్టపోకుండా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏపీలో రూ.౫౦
ఏపీ ప్రభుత్వం కూడా టమాటాను రైతు బజార్లలో తక్కువ ధరకే అందిస్తోంది. రాష్ట్రంలోని పలు రైతు బజార్లలో రాయితీపై రూ. 50 లకే కిలో టమాటా ఇస్తున్నారు. ఒక్కో ఫ్యామిలీకి కేజీ పరిమితి చొప్పున విక్రయిస్తున్నారు. సబ్సిడీపై తక్కువకే టమాటాలు వస్తుండడంతో రైతు బజార్లకు ప్రజలు పోటెత్తుతున్నారు. టమాటాలు తీసుకునే క్రమంలో తోపులాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
తినకుండానే మిర్చి ఘాటు
కేవలం టమాటా ధరల కాదు..ఇతర నిత్యావసర వస్తువులు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. దాంతో పరిస్థితి ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్లుగా ఉంది. పచ్చిమిర్చి కూడా తినకుండానే ఘాటెక్కిస్తోంది. పచ్చిమిర్చి నిల్వలు భారీగా తగ్గడంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.