Home > జాతీయం > ఒడిశా రైలు ప్రమాదం.. వారం గడిచినా ఆ 82 మందెవరో ఇంకా గుర్తించలేదు

ఒడిశా రైలు ప్రమాదం.. వారం గడిచినా ఆ 82 మందెవరో ఇంకా గుర్తించలేదు

ఒడిశా రైలు ప్రమాదం.. వారం గడిచినా ఆ 82  మందెవరో ఇంకా గుర్తించలేదు
X



ఒడిశా రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన జ‌రిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా 82 పార్థివదేహాలను గుర్తించలేదు. పరదీప్‌ నుంచి తెచ్చిన 5 ప్రత్యేక ఏసీ కంటైనర్లలో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో మృతదేహాలను ఉంచారు. వీటిని బంధువులు లేదా కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత భువనేశ్వర్‌ నగరపాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్‌ విజయ్‌ అమృత కుళంగెకు అప్పజెప్పారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ... భువనేశ్వర్‌కు 193 పార్థివదేహాలు చేరుకోగా, 111 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామన్నారు. మిగతావాటికి డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తున్నామన్నారు. వీటిని గుర్తించడానికి ఝార్ఖండ్‌, బిహారు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల అధికారులను సంప్రదిస్తున్నామన్నారు. డీఎన్ఏ శాంపిల్స్ సరిపోలిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆయన అన్నారు.

అయితే ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను ప్రమాద ప్రాంతమైన బహనాగా బజార్​ హైస్కూల్​లో ఉంచారు. తాత్కాలిక మార్చురీగా స్కూల్ భవనాన్ని మార్చి అక్కడే రైలు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను భద్రపరిచారు. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం కూడా పాతబడిన కారణంగా కూల్చివేసి.. కొత్త భవనం కట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

గత శుక్రవారం లూప్‌లైన్‌లో ఆగిన గూడ్స్‌ రైలును.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దాని బోగీలు ఎగిరి పక్కనున్న పట్టాలపై పడడం వల్ల.. ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హవ్‌డా కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు పూర్తికావడం వల్ల రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.




Updated : 9 Jun 2023 8:05 AM IST
Tags:    
Next Story
Share it
Top