Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. అమరులైన ఇద్దరు ఆర్మీ అధికారులు
X
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతాదళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ కల్నల్, మేజర్‌తో పాటు, జమ్మూ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి అమరులయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకర్‌నాగ్ లోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారు.
కోకర్ నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని పక్కా సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వారి కోసం మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. బుధవారం ఉదయం వరకు ఆపరేషన్ కొనసాగింది. ఉగ్రమూకలు కాల్పులు జరగపడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగారు. అయితే టెర్రరిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆర్మీ, పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి మన్‌ప్రీత్ సింగ్, ఆర్మీ మేజర్ మనోజ్ ఆశీష్ ఢోన్‌చక్, జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి హుమన్యూన్ ముజాహిల్ భట్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక ముగ్గురు అధికారులు కన్నుమూశారు. ఈ ఎన్ కౌంటర్లో భద్రతాదళాల చేతుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.