రూ.1.3 కోట్ల సెల్ ఫోన్లు మాయం చేసిన లారీ డ్రైవర్లు
X
కర్నూల్ జిల్లా డోన్ హైవే పై భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. హర్యానా నుంచి బెంగళూరుకు సెల్ ఫోన్ వెళ్తున్న కంటెయినర్‌ను దాని డ్రైవర్లే దోచేశారు. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఓబుళాపురం మిట్ట సమీపంలో ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
సెల్‌ఫోన్ల లోడుతో హరియాణా నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్‌ను రోడ్డు పక్కనే ఆపిన డ్రైవర్లు.. అందులోని సెల్‌ఫోన్లను మరొక వాహనంలోకి మార్చేసి.. కంటైనర్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. అయితే లారీ డ్రైవర్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ యజమాని డోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డోన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు హర్యానాకు స్పెషల్ టీమ్ ను పంపారు.