ఆకాశం నుంచి పొలంలో పడ్డ ఆయిల్ ట్యాంకులు
X
ఆకాశం నుంచి ఒక్కసారిగా రెండు ఆయిల్ ట్యాంకులు పరి పొలంలో పడడంతో.. అక్కడే పనిచేస్తున్న రైతులు, కూలీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దంతో ఇంధన ట్యాంకులు పొలంలో పడడం వల్ల ఏం జరిగిందో అర్థం కాక కంగారుపడ్డారు. ఎవరూ ఇంధన ట్యాంకుల వద్దకు వెళ్లే సాహనం చేయలేదు. సోమవారం మధ్యాహ్నం ఉత్తర్‌ప్రదేశ్.. సంత్ కబీర్‌నగర్ జిల్లాలోని బలుశాషన్ గ్రామంలో జరిగిందీ ఘటన. వరి పొలంలో కలుపు తీస్తున్న సమయంలో పెద్ద శబ్ధం వినిపించిందని అక్కడే ఉన్న రైతులు, కూలీలు చెప్పారు. క్షిపణి లాంటివి రెండు పొలంలో పడ్డాయని, అవి పేలుతాయని భయపడి వాటి కే వాటి దగ్గరకు తామేవరూ వెళ్లలేదని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా... వారు వచ్చి పొలంలో పడినవి.. విమానం ఇంధన ట్యాంకులని చెప్పడం వల్ల ఊపీరి పీల్చుకున్నామన్నారు.
భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల బాహ్య ఇంధన ట్యాంకును పైలట్.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. "ఆ ఇంధన ట్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఉన్న బంజారియా బలుశాషన్ అనే గ్రామంలో పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు" అని అధికారులు పేర్కొన్నారు. ఇంధన ట్యాంకు వరి పొలంలో పడిన సమాచారాన్ని జిల్లా ఎస్పీ.. వాయుసేనకు తెలియజేశారు. సాధారణ శిక్షణలో భాగంగా ఈ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి నింగిలోకి పయనమైంది. అది వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.