Home > జాతీయం > ఉప్పొంగుతున్న సముద్రం.. జూహూ బీచ్లో ఇద్దరు మైనర్ల గల్లంతు

ఉప్పొంగుతున్న సముద్రం.. జూహూ బీచ్లో ఇద్దరు మైనర్ల గల్లంతు

ఉప్పొంగుతున్న సముద్రం.. జూహూ బీచ్లో ఇద్దరు మైనర్ల గల్లంతు
X

బిపోర్జాయ్ తుఫాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రం ఉప్పొంగుతుండటంతో బీచ్ లలో గస్తీ చేపట్టారు. నీళ్లలోకి వెళ్లొద్దని పర్యాటకులను ఆదేశించారు. అయితే వారి హెచ్చరికలను పట్టించుకోకుండా సోమవారం సాయంత్రం నలుగురు యువకులు జుహూ బీచ్‌లోని సముద్రంలోకి వెళ్లారు. అలల ఉద్ధృతికి వారు కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చేపట్టగా ఇద్దరు యువకుల మృతదేహాలు దొరికాయి. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.

ముగ్గురు మృతి

మరోవైపు తుఫాను కారణంగా గుజరాత్‌లోనూ ముగ్గురు మృతిచెందారు. బలమైన గాలులు వీస్తుండటంతో ఇప్పటికే అనేక చెట్లు నేలకూలాయి. రాజ్‌కోట్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులపై చెట్టు కూలడంతో భార్య మరణించగా.. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బిపోర్‌జాయ్‌ తుఫాను పోరుబందర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 300 కి.మీలు, ద్వారకకు నైరుతి దిశలో 290 కి.మీలు, జఖౌ పోర్టుకు దక్షిణ-నైరుతి దిశలో 340కి.మీలు దూరంలో ఉంది. జూన్‌ 15 సాయంత్రానికి తుఫాను జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది.

67 రైళ్లు రద్దు

తుఫాను కారణంగా పశ్చిమ రైల్వే పరిధిలో వందకుపైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఇప్పటివరకు 67 రైళ్లు రద్దు చేశారు. మరో 56 రైళ్ల ప్రయాణాన్ని కుదించారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ముంబైలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగింది. మరోవైపు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నందున తీర ప్రాంత ప్రజలను అధికారులు సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కచ్‌, ద్వారక ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు 15వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

సీఎంకు మోడీ ఫోన్‌

బిపోర్జాయ్ తుపాను ముప్పుపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. తుఫాను పరిస్థితిపై సోమవారం రివ్యూ నిర్వహించిన ప్రధాని మోడీ గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.




Updated : 13 Jun 2023 6:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top