కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
X
కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి కోజికోడ్కు చెందిన ఇద్దరు చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మృతులు ఇద్దరూ కోజికోడ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిఫా వైరస్ మళ్లీ ప్రబలే అవకాశముండటంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
నిఫా లక్షణాలతో ఓ వ్యక్తి ఆగస్టు 30న చనిపోగా.. సోమవారం మరొకరు మృత్యువాత పడ్డారు. చనిపోయిన ఇద్దరి శాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో కోజికోడ్ కు చేరుకున్న ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ వైద్యారోగ్య శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించి వైరస్ వ్యాప్తి చెందకుడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. హై రిస్క్ కేటగిరిలో ఉన్న పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నిఫా నిర్థారణ కావడంతో వైరస్ ప్రబలకుండా ఆంక్షలు విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నిఫా వైరస్ నిర్థారణ కావడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు ఓ బృందాన్ని కేరళకు పంపింది. కోజికోడ్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించింది. నిఫా వైరస్పై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మృతులతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయన్ భరోసా ఇచ్చారు.