Home > జాతీయం > గణేశ్​ నిమజ్జనంలో విషాదం.. కళ్లముందే కుటుంబమంతా ఉన్నా..

గణేశ్​ నిమజ్జనంలో విషాదం.. కళ్లముందే కుటుంబమంతా ఉన్నా..

గణేశ్​ నిమజ్జనంలో విషాదం.. కళ్లముందే కుటుంబమంతా ఉన్నా..
X

దేశ వ్యాప్తంగా గణపతి మండపాల్లో బుజ్జి గణపయ్య కొలువు దీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. గణపతి నవరాత్రి వేడుకలను ఓ వైపు ఘనంగా జరుపుకుంటుంటే.. మరోవైపు అనేక చోట్ల వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే గణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా గుజరాత్​లోని రాజ్​కోట్​ జిల్లాలో గణేశ్​ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక ప్రతిమను నిమజ్జనం చేస్తూ మామ,మేనల్లుడు మృతి చెందారు. ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. రాజ్​కోట్​ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన 8మంది కుటుంబసభ్యులు వినాయక నిమజ్జనం కోసం ఆజీ నదిపై ఉన్న డ్యామ్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు నది మధ్యలోకి వెళ్లారు. అనంతరం పెద్ద గుంతలో ఇరుక్కున్నారు. దీంతో మామాఅల్లుళ్లు హర్ష గోస్వామీ-కేతన్​ గోస్వామీ మృతి చెందారు. ఇంకో వ్యక్తి మాత్రం ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డ్యామ్​ వద్దకు వచ్చారు. గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా గణేష్ నిమజ్జన వేడుకల్లో పలు చోట్ల విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన గణేషుని శోభాయాత్రలో ఓ యువకుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో బ్యాండ్‌ చప్పుళ్లకు.. అనుగుణంగా డ్యాన్స్ చేసిన యువకుడు.. ట్రాక్టర్ ఇంజిన్ ఎక్కి పల్టీ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఊహించని రీతిలో ఆ పల్టీ మిస్‌ ఫైర్ అయి ఆ యువకుడు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆ యువకుడు బరువు ఎక్కువగా ఉండటంతో.. పల్టీ కొడుతున్న సమయంలో ల్యాండింగ్ సరిగ్గా కాకపోవటంతో.. తల రోడ్డుకు బలంగా కొట్టుకుంది. తోటి యువకులంతా వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. యువకుడి బరువంతా తలపైనే పడటంతో.. తలలోని నరాలు పగిలిపోయినట్టు వైద్యులు తెలిపారు.




Updated : 24 Sept 2023 12:04 PM IST
Tags:    
Next Story
Share it
Top