దాన్ని ముందు హిందువులకు పెట్టాలి.. మోదీకి డీఎంకే కౌంటర్
X
దేశాంనికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని, ముస్లింలు బుజ్జగించేందుకే విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై చర్చించడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. మరోపక్క తమిళనాడు అధికార పార్టీ అగ్రనేత డీఎంకే ఇళంగోవన్ కూడా తీవ్ర విమర్శలు సంధించారు. అసమానతలు ఉన్న హిందూమతానికి ఉమ్మడి పౌరస్మృతిని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
‘‘ఆలయాల్లోకి అన్ని కులాల వారిని అనుమతించేలా హిందువులకు ఒక ఉమ్మడి పౌరస్మృతి తీసుకురండి. ఎస్సీలు, ఎస్టీలు దేశంలోనే ఏ గుడిలోకైనా వెళ్లి పూజల చేసేందుకు అనుమతివ్వండి. ప్రతి మతానికి రాజ్యంగం రక్షణ కల్పించింది. ఉమ్మడి పౌరస్మృతి మనకు అక్కర్లేదు’’ అని టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. మోదీ ఇలాంటి పనికిమాలిన విషయాలకు బదులు దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, పేదరికం గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. మణిపూర్ మంటల్లో తగలబుడుతోంటే మోదీ అనవసర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని ఏమన్నారు?
దేశంలోని ముస్లింలు మహిళలకు న్యాయం జరగాలంటే ట్రిపుల్ తలాఖ్ లాంటివి ఉండకూడదని మోదీ అన్నారు. మంగళవారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నారు. ‘‘ఒకదేశంలో రెండు చట్టాలు కుదరవు. భారత రాజ్యంగం పౌరలందరీకీ సమాన హక్కులు ప్రసాదిస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా దేశంలో రెండు చట్టాలు ఉండొద్దు. ఉమ్మడి పౌరస్మృతి కావాలని సుప్రీం కోర్టు కూడా కోరుతోంది. దేశంలోని విపక్షాలు ప్రజలను అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయి’’ అని మండిపడ్డారు.