రూ.89,047 కోట్లతో BSNLని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు!!
X
భారత టెలికాం రంగంలో ప్రస్తుతం అతిపెద్ద పోటీ కొనసాగుతోంది. ఒకప్పుడు పదికి పైగా ఉన్న కంపెనీల సంఖ్య భారీగా తగ్గింది. ప్రధానంగా పోటీ రెండు మూడు కంపెనీల మధ్యనే కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రైవేటు టెలికాం ఆపరేట్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ వేగంగా దూసుకొస్తోంది. వాయిస్ కాల్స్ మరియు డేటాపై తక్కువ ధరలకు 4G సేవలను అందుబాటులోకి తెచ్చిన జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా నుండి BSNL తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించిన సంస్థ సేవల నాణ్యతను పెంచుకునేందుకు టాటాలకు చెందిన టీసీఎస్ తో జతకట్టింది. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తోంది.
ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ ఉనికిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. విశ్వసనీయమైన సమాచారం మేరకు.. కేంద్ర మంత్రివర్గం బీఎస్ఎన్ఎల్ కోసం రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించిందని తెలుస్తోంది. "ఈ పునరుద్ధరణ ప్యాకేజీతో, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంపై దృష్టి సారించిన స్థిరమైన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా BSNL ఉద్భవిస్తుంది" అని క్యాబినెట్ ఒక ప్రకటనలో తెలిపింది.
దీనికి ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దేశంలో బీఎస్ఎన్ఎస్ తన 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ITIకి రూ.3,889 కోట్ల విలువైన ముందస్తు కొనుగోలు ఆర్డర్(APO)ని అందజేసింది. దీని ద్వారా వినియోగదారులకు అధునాతన 4G సేవలను అందించడానికి BSNL చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ప్రధాన ముందడుగని చెప్పుకోవచ్చు.