Interim Budget: రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
X
ఫిబ్రవరి 1వ తేదీన(గురువారం) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని లేదా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. ఈసారి కూడా కేంద్ర ఆర్థిక శాఖ డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. రేపు ఉదయం 9 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. 11 గంటల నుంచి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్ అవుతుందా అనేది చాలామందిలో చర్చ జరుగుతోంది. నిర్మలమ్మ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వేతన జీవులు ఎప్పుడూ ఎదురు చూసే పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇక విద్య వైద్య వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.
ఇప్పటి వరకు 77 రెగ్యులర్ బడ్జెట్‌లు,14 తాత్కాలిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టడం జరిగింది. 1947 నవంబర్ 26వ తేదీన తొలి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో 171.05 కోట్ల ఆదాయం వస్తుందని నాటి ప్రభుత్వం అంచనా వేసింది. 1947 నవంబర్ 26వ తేదీన స్వతంత్ర భారత్‌లో షణ్ముగం చెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బ్రిటీష్ రాజ్యంలో 1860లో భారత్‌కు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యూకే సమయంతో సమన్వయంగా ఉండేందుకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ఉండేది. ఫిబ్రవరి నెలలో చివరి పనిదినం రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఒకప్పుడు బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు.బ్రిటీషర్లు మొదలు పెట్టిన ఈ సంప్రదాయానికి 1999లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి యశ్వంత్ సిన్హా స్వస్తి పలికారు.సాధారణ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ .