Dr. Mansukh Mandaviya : పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
X
దేశంలో కొవిడ్ 19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జేఎన్.1 సబ్ వేరియెంట్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, రాష్ట్రాల సన్నద్దతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి 3 నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మాండవీయ సూచించారు.
కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మన్ సుఖ్ మాండవీయ అన్నారు. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దన్న ఆయన... రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. పండగ సీజన్‌తో పాటు చలికాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.
గత కొన్ని రోజులుగా దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 కారణమని గుర్తించారు. ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని సూచించింది.
మరోవైపు కోవిడ్ జేన్.1 వేరియంట్‌కు భయపడాల్సిన అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ ఇస్తుందని చెప్పింది.