Amit Shah : నేడు రాష్ట్రానికి మరోసారి అమిత్ షా
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా.. ఇవాళ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. శనివారమే ఆయన తెలంగాణకు వచ్చి... అదే రోజు ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక్కరోజు గ్యాప్‌లోనే మళ్లీ ఇవాళ రాష్ట్రానికి రాబోతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్ షా ఒక్కరే కాదు.. మరికొంతమది బీజేపీ అగ్రనేతలు కూడా ఈరోజు తెలంగాణకు రానున్నారు. కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మరో బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్.. వీరంతా రాష్ట్రంలో పలుచోట్ల విడివిడిగా ప్రచారం చేయనున్నారు.
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో కమలం పార్టీ అగ్ర నేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. ప్రధాని, అమిత్ షా, నడ్డా ఇప్పటికే పలుమార్లు ప్రచార సభల్లో పాల్గొనగా.. మరోసారి రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి ప్రచారం ముగిసే వరకు రాష్ట్రంలో ప్రచార దండయాత్ర చేయనున్నారు. అందులో భాగంగానే అమిత్ షా ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించనున్నారు.
షెడ్యూల్ ఇదే..
మధ్యాహ్నం 12: 25కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 12: 35 గంటలకు జనగామ బయల్దేరి వెళ్తారు. జనగామలో 1:15 నుంచి 1: 55 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు కోరుట్లలో జరిగే సభలో పాల్గొంటారు. కోరుట్ల సభను ముగించుకుని ఉప్పల్‌కు చేరుకోనున్న అమిత్ షా.. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరఫున రోడ్ షో నిర్వహిస్తారు.
అగ్రనేతలంతా తెలంగాణకు
మరో బీజేపీ అగ్రనేత కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎల్లారెడ్డి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ జూబ్లీహిల్స్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి తరపున పడ్నవీస్ రోడ్ షోలో పాల్గొననున్నారు.