Hardeep Singh Puri : ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గుతాయా.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?
X
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. పెట్రో ధరలు తగ్గిస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని చెప్పారు. ఇది కేవలం ప్రచారమేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
పెట్రోల్ రేట్లు తగ్గడం లేదా పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయని కేంద్రమంత్రి చెప్పారు. అంతర్జాతీయ చమురు ధరలు, రిఫైనింగ్ ఖర్చు,రవాణా ఖర్చులు, పన్నులు వంటి అనేక అంశాలు ఇంధన ధరలను నిర్దేశిస్తాయని వివరించారు. ఈ అంశాలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపై ఇంధన ధరలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనా మహమ్మారి తర్వాత 2022లో చమురు ధరలు పెరిగిన సమయంలో.. ధరలు తగ్గించాలని చమురు సరఫరా చేసే దేశాలను భారత్ అడగలేదన్నారు.
ఈ సమయంలో ధరలు పెంచకపోవడంతో పాటు ఎక్సైజ్ పన్ను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించినట్లు హర్దీప్ సింగ్ పురీ గుర్తుచేశారు. 2022 జూన్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. 2021 నవంబర్, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గాయని తెలిపారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంధనంపై వ్యాట్ తగ్గించాయని దీంతో ధరలు మరింత తగ్గాయని చెప్పారు.