మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయం - కిషన్ రెడ్డి
X
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు దక్కకపోయినా బీజేపీ అద్భుత విజయాలు సొంతం చేసుకుందని అన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు డిసెంబరు 28న రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కిషన్ చెప్పారు. రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నట్లు వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. 5 రాష్ట్రాల్లోనూ బీజేపీపై దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలని చూసిన వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో అందరూ బీజేపీ వైపే నిలుస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.