హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే..?
X
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం (జూన్ 28) ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్ఆర్ఆర్ చుట్టూ ఓటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ ను కేంద్రం ఆమోదించిందని.. ఈ ప్రాజెక్ట్ వల్ల హైదారాబాద్ కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ తరహా ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిదని.. సర్వే కోసం రైల్వే శాఖకు రూ. 14 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జరిగితే రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు మేలు జరుగుతుందని అన్నారు. 350 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పుకొచ్చారు.
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు రూ. 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన కిషన్ రెడ్డి.. దీనికోసం భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం కేంద్రమే భరిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని.. వారి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైలు రూట్ ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండోదశలో.. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యాపార, రవాణా రంగంలో గణనీయమైన మార్పు వస్తుందని.. విజయవాడ, గుంటూరు, వరంగల్, మెదక్, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైలు కనెక్టివిటీగా ఉంటుందన్నారు కిషన్ రెడ్డి.
పర్యాటక రంగంలో మార్పుకు:
గోవాలో ఈనెల 21, 22 తేదీల్లో మంత్రుల సమావేశం జరగనుందని కిషన్రెడ్డి తెలిపారు. గోవా డిక్లరేషన్ పేరిట రోడ్ మ్యాప్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. వివిధ దేశాల పర్యటకశాఖల మధ్య సమన్వయం కోసం చర్చలు జరపడంతో పాటు.. శాఖల మధ్య పరస్పర ఒప్పందాలకు అంగీకారం కుదిరిందన్నారు. భారత్ లో యునైటెడ్ నేషన్స్ ప్రాంతీయ కార్యాలయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.