రామయ్య భక్తుల సౌకర్యం కోసం దివ్య అయోధ్య యాప్
X
అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్యకు సంబంధించి భక్తులు సమస్త సమాచారం తెలుసుకునేందుకు దివ్య్ అయోధ్య పేరుతో రూపొందించిన యాప్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్లో అయోధ్య నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించి సమస్త సమాచారం అందుబాటులోకి తెచ్చారు.
దివ్య్ అయోధ్య యాప్ ద్వారా హోటళ్లు, హోం స్టేలు, గుడారాలు, వీల్ ఛైర్ అసిస్టెన్స్, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, టూరిస్టు గైడ్ లను ఈ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాప్‌లో స్థానికంగా చూడదగ్గ ప్రదేశాలు, టూర్ ప్యాకేజీల వివరాలతో పాటు స్థానిక వంటల గురించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు యూపీ సర్కారు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా నగర శివార్లలో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఇండ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. హోం స్టే కోరుకునే భక్తుల కోసం వీటిని కేటాయించనున్నట్లు సీఎంఓ ప్రకటించింది. అయోధ్యలో ఇప్పటికే ధర్మ పథ్, రామ్ పథ్ పేరుతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ఇప్పటికే ప్రారంభించారు. జనవరి 19 నుంచి లక్నో - అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్ కూడా షురూ కానుంది.
అయోధ్యలో జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 11వేలకుపైగా అతిధులు హాజరుకానున్నట్లు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. ప్రాణప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డూతో పాటు అయోధ్య మట్టిని అందజేయనున్నారు.