BJP నేత హత్య కేసు నిందితుణ్ని కోర్టు ఆవరణలోనే చంపేశారు
X
కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు కొందరు దుండగలు. ఓ బీజేపీ నేత హత్య కేసులో సహ నిందితుడిగా మృతుడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బుధవారం విచారణకు హాజరైన అతడిని చంపేశారు. ఎత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ యూపీలో క్రిమినల్ గ్యాంగ్‌ను నడుపుతోన్న గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను.. గుర్తు తెలియని వ్యక్తులు లాయర్ డ్రెస్సుల్లో వచ్చి.. అతడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
పశ్చిమ యూపీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన సంజీవ్ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ పోలీస్ కస్టడీలో హత్యకు గురైన రెండు నెలల్లోనే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా నేలపై పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఓ బాలిక గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో ఓ క్రిమినల్ కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడిపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడినుంచి తప్పించుకొని పారిపోయారు.