వారెవ్వా ఏం ఐడియా గురూ... భూగర్భంలో రెండంతస్తుల మేడ
X
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు పనులు సవ్యంగా జరగాలంటే ముఖ్యంగా సమన్వయం ఎంతో అవసరం. అందులో ఇంటి విషయానికి వస్తే సిమెంటు, ఇటుకలు, రాళ్లు, ఐరన్ రాడ్లు, మేస్త్రీలు, ప్లానింగ్, బడ్జెట్ ఇలా సవాలక్ష పనులు ఉంటాయి. నిజానికి ఓ ఇంటిని నిర్మించాలంటే ఇంత మంది అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ అవసరం లేకుండా చిన్నపాటి పారతో భూగర్భంలో రెండంతస్తుల మేడను ఒకే ఒక్కడు 12 ఏళ్లు శ్రమించి నిర్మించాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీలో ఉంటున్న ఇర్ఫాన్ కుర్పా ఈ ఘనతను సాధించాడు. ఏకంగా 12 ఏళ్లు శ్రమించి ఒక్కడే భూమి అడుగన అలనాటి అందమైన రెండంతస్తుల మేడను నిర్మించాడు.
పైకి బంకర్‌లా కనిపించే ఈ ఇంటిని తమ కుటుంబం జీవనాధారంగా భావించే వ్యవసాయ భూమిలోని మట్టితో నిర్మించడం స్పెషాలిటీ. ఇర్పాన్ తండ్రి 2010లో చనిపోయారు. అప్పటి నుంచే ఇర్ఫాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఉపాధి నిమిత్తం ఢిల్లీ వెళ్లాడు. అక్కడే కొన్ని రోజులు పని చేశాడు. ఆ తరువాత గ్రామానికి తిరిగివచ్చిన ఇర్ఫాన్ స్థానికంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో ఇర్ఫాన్ ఓడిపోయాడు. దీంతో ఆ నిరాశతో మళ్లీ గ్రామం నుంచి వెళ్లిపోయాడు. ఇలా ఉంటే కాదు ఎలాగైనా సొంతింటిని కట్టాలని నిర్ణయించుకున్న ఇర్ఫాన్ మరోసారి గ్రామానికి తిరిగి వచ్చాడు. 2011లో భూగర్భంలో ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. చిన్న పార లాంటి పరికరం సాయంతో ఒక్కడే శ్రమించి పాతకాలంలో ఉండే విధంగా అండాకారంలో ఇంటిగోడలను అందంగా చెక్కాడు. అలా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన ఇర్ఫాన్ కేవలం భోజనం చేసేందుకు మాత్రమే కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్లేవాడు. ఈ భూగర్భ ఇంటిని సాదాసీదాగా కట్టేయలేదు. రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. 12 గదులను కట్టాడు ఇర్ఫాన్. ప్రార్థన మందిరం, డ్రాయింగ్ రూం, డైనింగ్ రూమ్, హాల్ ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా గదులతో చక్కగా కట్టాడు. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఇంటిని చూసి వారెవ్వా క్యా ఐడియా గురూ అంటూ ఇర్ఫాన్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
#WATCH | Uttar Pradesh | In Hardoi, a man builds an underground two-storeyed house with 11 rooms, over a span of 12 years. pic.twitter.com/2siU0K5LHc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 30, 2023