10 ఏళ్ల కిందట అదృశ్యం.. పిచ్చోడిగా మారిన భర్తను చూసి..
X
పదేళ్ల క్రితం అదృశ్యమైన భర్తను అనుకోకుండా దీన స్థితిలో కలుసుకుంది ఓ భార్య. మాసిన గడ్డంతో, పెరిగిన జుత్తుతో మతిస్థిమితం లేని ఆ వ్యక్తి తన భర్తే అని గుర్తించి.. వెంటనే అతడిని కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. బాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మ (45)కు 21 ఏళ్ల క్రితం జానకి దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచి మోతీచంద్ మానసిక పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. దీంతో మోతీచంద్‌ను తన బంధువులతో పాటు చికిత్స కోసం నేపాల్‌కు పంపించింది అతని భార్య జానకి. ఈ క్రమంలో మోతీచంద్ తప్పిపోయాడు. మోతీచంద్ ఆచూకీ కోసం అతడి తండ్రి ఎంతగానో ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు.
తర్వాత భర్త ఆచూకీ కోసం జానకి దేవి.. తన సోదరుడితో కలిసి నేపాల్ వెళ్లి గాలించింది. ఇంటింటికీ తిరిగి వెతికింది. తాంత్రికులు, బాబాలను కలసి తన భర్త ఆచూకీ కోసం ఎన్నో పూజలు చేసింది. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్లినా.. భర్త మోతీచంద్ ఫొటోను తనతో తీసుకెళ్లేది. తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు సహకరించాలని అధికార యంత్రాంగానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. జానకి తన భర్త ఆచూకీ తెలుసుకోలేకపోయింది.
ఇక అనారోగ్యంగా ఉన్న తన కుమారుడి కోసం రోజూ జిల్లా ఆస్పత్రికి వెళ్తుండేది జానకి. ఈ క్రమంలో శనివారం కూడా అలాగే వెళ్లింది. అయితే, ఆ ఆస్పత్రి సమీపంలోని రోడ్డు పక్కన చిరిగిన పాత బట్టలు వేసుకుని.. పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసింది. 10 ఏళ్ల క్రితం అదృశ్యమైన తన భర్త అతడేనని తొలి చూపులోనే గుర్తించింది జానకి. ఆ తర్వాత అతడిని కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తన భర్త తనకు దక్కినందుకు.. దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
In UP's Ballia, a woman was reunited with her husband who had gone missing 10 years ago. The woman claimed she bumped into her missing husband while she was on her way to hospital. pic.twitter.com/eNGrih1p52
— Piyush Rai (@Benarasiyaa) July 29, 2023