Home > జాతీయం > రాష్ట్రాల్లో జట్లు పట్టుకుని కొట్లాడుతూ, దేశానికి జడవేస్తాయా?

రాష్ట్రాల్లో జట్లు పట్టుకుని కొట్లాడుతూ, దేశానికి జడవేస్తాయా?

రాష్ట్రాల్లో జట్లు పట్టుకుని కొట్లాడుతూ, దేశానికి జడవేస్తాయా?
X

దేశ రాజకీయాలు ఉన్నట్టుండి పేలబోతున్న అగ్నిపర్వతంలా వేడెక్కాయి. అవినీతి, పేదరికం, నిరురుద్యోగం అధికధరలు వంటి అంశాలన్నీ ఎప్పట్లాగే పక్కకు తప్పుకుని ఎన్డీఏ వర్సెస్ యూపీఏ వార్ తెరపైకి వచ్చింది. అటు ఢిల్లీలో అధికార కూటమి, ఇటు బెంగళూరులో విపక్షాల కుంపటి సమావేశమైన యుద్ధానికి కత్తులు నూరుతున్నాయి. ఎన్డీఏ భేటీకి 38 పార్టీలు, యూపీఏ భేటీకి 24 పార్టీలు హాజరై మంతనాలు జరుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనాసరే గద్దె దింపాలన్నది విపక్షాల లక్ష్యం.

‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదు’ అని కురుక్షేత్ర సంగ్రామానికి దిగాయి. ‘‘మాలో మాకు ఎన్ని సమస్యలు ఉన్నా మతతత్వ పార్టీ మరోసారి అధికారంలోకి రాకుండా పొరపొచ్చాలు పక్కన పెట్టి కొట్లాడతాం’’ అంటున్నాయి. యూపీఏ పేరులో పాతవాసన ఉందని, మార్చేసి కొత్త జవసత్వాలతో ప్రజల ముందుకు వెళ్తామంటున్నాయి. దేశమూ, ప్రజలూ అనేక సమస్యల్లో చిక్కుకుని అల్లాడుతున్న నేపథ్యంలో విపక్షాలు ఏకతాటిపైకి రావడం అభినందనీయం. అయితే ఎన్నికల ముందు చేస్తున్న ఈ హడావుడిలో చిత్తశుద్ధి ఎంత? తమలో తాము జట్టుపట్టుకుని కొట్టుకుంటున్న విపక్షాలు విశాలమైన దేశీయ ఎజెండాతో ఎలా ముందుకు వెళ్తాయి? ఏ అజెండాతో పొత్తు పెట్టుకుని, ఎంతమేరకు త్యాగాలు చేస్తాయి? సొంత రాష్ట్రాల్లో ఉప్పునిప్పుల్లా, పోట్లగిత్తలా కొమ్ములు విసురుకునే ప్రాంతీయ విపక్షాలు మతం పేరుతో దేశవ్యాప్తంగా ఓటర్లను పోలరైజ్ చేస్తున్న కాషాయ పీఠాన్ని ఎంతవరకు కదిలిస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రస్తుతానికి నిరాశా జనకమే.. విపక్షాల భేటీలో పాల్గొంటున్న కొన్ని ప్రధాన పార్టీల పరిస్థితి చూస్తే వాటి ఐక్యతపై ఎన్నో సందేహాలు తలెత్తడం సహజం. రాష్ట్రాల వారీగా గమనిస్తే..

యూపీలో ఎస్పీ వర్సెస్ బీఎస్పీ

ఢిల్లీ పీఠానికి ఉత్తర్ ప్రదేశ్ ను దగ్గరి దారిగా భావిస్తారు. అక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో అధికారం చేపట్టడం సులువవుతుంది. 80 పార్లమెంటు స్థానాలున్న ఆ రాష్ట్రంలోనే విపక్షాల మధ్య ఐక్యత ఏ మాత్రం కనిపించడం లేదు. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతికి అసలు విపక్షాల భేటీకి ఆహ్వానమే అందలేదు. దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న బీఎస్పీ యూపీలో ఘోరంగా దెబ్బతిన్నది. ఆ పార్టీలోని చాలా మంది నేతలు వేరే పార్టీల్లో చేరారు. దీనికి తోడు కేసుల కత్తి మాయావతి మెడపై వెలాడుతూనే ఉంది. ఈ భయంతోనే ఆమె కొన్ని కొన్ని సార్లు బీజేపీ కి అనుకూలంగా మాట్లాడతారాన్న విమర్శలున్నాయి. సంస్థాగతంగా ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఒక్క మాయవతి చరిష్మా తప్ప ఆ పార్టీకి ఇంకేం మిగలలేదు. ఇలాంటి స్థితిలో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లో బీఎస్పీ లేదు. అలా అని కాంగ్రెస్ తో కలవలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు కాంగ్రెస్ ను డైరెక్ట్ గానే విమర్శించింది. ఎస్పీ తో పొత్తు బెడిసి కొట్టిన తరువాత ఆ రెండు పార్టీల మధ్య దగ్గర కాలేనంత దూరం పెరిగింది.దళిత బహుజన వ్యతిరేకిగా ముద్రపడ్డ బీజేపీతో తలపడి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే బెహన్ జీ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో కలసి నడవక తప్పని పరిస్థితి. ఒకవేళ యూపీఏతో జట్టుకడితే యూపీలో సమాజ్ వాదీ పార్టీలో కలిసి పనిచేయాలి. దశాబ్దాల వైరమున్న ఈ పార్టీలు ఉమ్మడి అజెండాతో ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరం.


శివసేన వర్సెస్ శివసేన, ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ

మహారాష్ట్రలో తాజా రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీతో జట్టుకడతారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఒకప్పటి మహారాష్ట్ర టైగర్ బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలుగా విడిపోయింది. షిండే ఎన్డీఏతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా.. ఉద్ధవ్ ఇండియా కూటమివైపు నిలబడ్డారు. ఇక బీజేపీ దెబ్బకు మరాఠా యోధుడు శరద్ పవార్ ఎన్సీపీ కకావికలం అయింది. అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అజిత్ వర్గం బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే, శరద్ పవార్ గ్రూపు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రజలు ఏ వర్గంవైపు నిలుస్తారన్నది ఆయా పార్టీలకే క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీపీ, ఉద్దవ్ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే.


బెంగాల్లో కామ్రేడ్స్ వర్రెస్ గడ్డిపూలు

పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల లెఫ్ట్ ఫాలనను మట్టికరిపించిన దీదీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు విపక్ష కూటమిలోని కామ్రేడ్లను తన ‘ఫ్రెండ్’ అంటున్నారు. కేరళ తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంతోపాటు, బలమూ కోల్పోయిన సీపీఎం, సీపీఐలు మమతా బెనర్జీ అభీష్టం ప్రకారం పనిచేయక తప్పదు. మోదీని ఓడించడానికి చేసే ఈ దోస్తానీ ఆ పార్టీలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంటుంది. బెంగాల్లో బీజేపీ బలం పుంజుకున్న నేపథ్యంలో తృణమూల్ గుర్తులోని గడ్డిపూలు ఎర్ర సుత్తీకొడవళ్లతో కలసి కషాయ కమలాన్ని ఎలా కోస్తాయో చూడాలంటే ఎన్నికల దాకా వేచిచూడాల్సిందే.


ఢిల్లీలో చేయి చేతిలో చీపురు

దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సింహస్వప్నమైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పుడు బీజేపీని నిలువరించడానిక కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్నికల్లో ఇరుపార్టీలకు లాభదాయకమైన పొత్తుతోపాటు ప్రచారంలో తమలో ఎవరూ ‘హర్ట్’ కాని విధంగా ప్రవర్తించడం కత్తిమీద సామే. కాంగ్రెస్‌తో పొత్తువల్ల ఆప్‌కు ఒరిగేదేమీ ఉండకపోయినా ఇతర రాష్ట్రాల్లో స్నేహబలంతో కాస్త లాభం ఉండొచ్చు. పంజాబ్‌లోనూ ఢిల్లీ పరిస్థితే తలెత్తుతుంది.


కర్ణాటక, కశ్మీర్, కేరళ..

కర్ణాటక చిన్న విపక్షం జేడీఎస్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రాష్ట్రంలోని విపక్షాలు(బీజేపీ) తన కలుపుకుని పోవడం లేదని అధినేత కుమారస్వామి చెప్పారు. ఆయన పార్టీ పేరుకు న్యాయం చేస్తూ యూపీఏలో చేరితే అధికార పక్షంతో కలసి పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన హస్తానికి ఆయన చేతిసాయం అక్కర్లేదు. ఉనికి కోసమే పొత్తుపెట్టుకున్నట్లు ఉంటుంది. కేరళలో మరింత వింత పరిస్థితి నెలకొంది. అధికార లెఫ్ట్, విపక్ష కాంగ్రెస్ రెండూ యూపీఏ గూటివే. అక్కడ బీజేపీకి బలం లేని నేపథ్యంలో వీటి పొత్తు వల్ల అనూహ్య ఫలితాలేమీ రాకపోచ్చవు. కశ్మీర్లో శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో నిత్యం కొట్లాడుతూ దేశయవనికపై సమైక్య రాగం ఎలా ఆలపిస్తాయన్నదీ ఆసక్తికమే.

తెలంగాణ, ఏపీ..

తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఏదో అద్భుతం జరిగి ఇవి రెండూ కలిసినా కొన్ని సీట్లు వదులుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. పైగా, తనే దేశానికి మూడో ప్రత్యామ్నాయం అంటున్న కేసీఆర్ ఏ కూటమిలోనూ చేరే అవకాశం లేదు. ఇక ఏపీలో కాంగ్రెస్ తప్ప మరే పార్టీ యూపీలో ఉండాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. టీడీపీ, వైకాపా ఒంటరిగా, బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

విపక్షాల మహాఘట్‌బంధన్‌లోని జేడీయూ, ఆర్జేడీ(బిహార్)లది కూడా సంక్లిష్ట సమస్యే. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి చిత్రమైన శత్రుమిత్ర వైఖరితో విపక్షాలు ఎన్డీఏని ఎలా ప్రతిఘటిస్తాయన్నది ఆసక్తికరం.!!

Updated : 18 July 2023 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top