49 ఏండ్ల క్రితం కాల్పులు.. 80 ఏండ్ల వృద్ధుడికి జీవిత ఖైదు
X
49 ఏళ్ల క్రితం జరిగిన ఓ నేరానికి సంబంధించిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు విధించింది యూపీలోని ఫిరోజాబాద్ కోర్టు. జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఆ వృద్ధుడు ఆ జరిమానాను చెల్లించలేని పక్షంలో మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాధితురాలని తరుఫు లాయర్ మీడియాకు తెలిపారు.
మహేంద్ర సింగ్ అనే వ్యక్తి నార్ఖీ ప్రాంతంలో నివసించేవాడు. 1974 సెప్టెంబర్ 14న అతడు ఓ మహిళను అతి దారుణంగా చంపేశాడు. ఆ మహిళ భర్త వద్దనున్న రైఫిల్ తోనే ఆమెను కాల్చి చంపాడు. స్థానిక రామ్బేటీలో ఈ హత్య జరిగింది. ఈ హత్య గురించి ఆమె కుమార్తె మీరా దేవీ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి మహేంద్ర సింగ్ ను అరెస్ట్ చేశారు కూడా.
అయితే అప్పుడు నార్ఖీ.. ఆగ్రా కోర్టు పరిధిలో ఉండడం వల్ల.. అక్కడ చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ బెయిల్ పై బయటికొచ్చాడు. కొంత కాలం క్రితం ఆ కేసు ఫిరోజాబాద్‌కు బదిలీ అయింది. దీంతో జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ గవర్నమెంట్ కౌన్సిల్- ఏడీజీసీ శ్రీనారాయణ్ శర్మ ఈ కేసులో విచారణ చేపట్టారు. విచారణ సమయంలో పలు వాంగ్మూలాలను, అధారాలను బాధితురాలి తరఫు లాయర్ కోర్టు ముందు ఉంచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు మహేంద్ర సింగ్‌ను దోషిగా తేల్చుతూ జీవిత ఖైదు శిక్షతో పాటు , 20 వేల జరిమానా వేస్తూ తీర్పు వెలువరించింది. ఒకవేళ ఆ జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించిందని లాయర్ వెల్లడించారు.