తన భర్తే అని కౌగిలించుకుంది.. అసలు నిజం తెలిసి అవాక్కైంది
X
పిచ్చి పట్టి రోడ్డు పక్కన తిరుగుతున్న వ్యక్తిని .. పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తే అనుకుంది ఆ మహిళ. మాసిన గడ్డంతో, పెరిగిన జుత్తుతో ఉన్న ఆ వ్యక్తిని కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. . తన కుమారులకు సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లాక ప్రశ్నించగా.. సమాధానం లేదు. అనుమానం వచ్చి పుట్టుమచ్చలు చూస్తే.. అతడు తన భర్త కాదనే అసలు విషయం తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మ (45)కు 21 ఏళ్ల క్రితం జానకి దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత మోతీచంద్ మతి భ్రమించింది. దీంతో మోతీచంద్‌ను తన బంధువులతో పాటు చికిత్స కోసం నేపాల్‌కు పంపించింది భార్య జానకి. ఈ క్రమంలో మోతీచంద్ తప్పిపోయాడు.
తర్వాత భర్త ఆచూకీ కోసం జానకి దేవి.. తన సోదరుడితో కలిసి నేపాల్ వెళ్లి గాలించింది. ఇంటింటికీ తిరిగి వెతికింది. తాంత్రికులు, బాబాలను కలసి తన భర్త ఆచూకీ కోసం ఎన్నో పూజలు చేసింది. తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు సహకరించాలని అధికార యంత్రాంగానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. జానకి తన భర్త ఆచూకీ తెలుసుకోలేకపోయింది.
ఇక అనారోగ్యంగా ఉన్న తన కుమారుడి కోసం రోజూ జిల్లా ఆస్పత్రికి వెళ్తుండేది జానకి. ఈ క్రమంలో శనివారం కూడా అలాగే వెళ్లింది. అయితే, ఆ ఆస్పత్రి సమీపంలోని రోడ్డు పక్కన చిరిగిన పాత బట్టలు వేసుకుని.. పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసింది. 10 ఏళ్ల క్రితం అదృశ్యమైన తన భర్త అతడేనని భావించి అతడిని కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తన భర్త తనకు దక్కినందుకు.. దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేసింది. కొడుకులు ఈ విషయం చెప్పి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లాక అసలు సినిమా స్టార్ట్ అయింది. ఏమైనా తింటారా? తాగుతారా? అని ఆమె ప్రశ్నలకు అతడి నుంచి.. ఎలాంటి సమాధానం లేదు. దీంతో అనుమానించిన జానకి దేవి అతడి పుట్టుమచ్చలు చూడగా.. సీన్ అర్దమైంది. జానకి దేవి తీసుకొచ్చిన వ్యక్తి మోతీచంద్ కాదని, అతడి పేరు రాహుల్ అని తేలింది. దీంతో తప్పు తెలుసుకున్న జానకి దేవి.. రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించింది.