తప్పిపోయిన కమిషనర్ కుక్క..500 ఇళ్లల్లో పోలీసుల సోదాలు
X
ఈ మధ్యకాలంలో మనుషుల మీద కన్నా కుక్కల మీద ప్రేమ ఎక్కువైపోయింది. కన్నవారితో సమానంగా కుక్కపిల్లలను పెంచుకుంటున్న రోజులు ఇవి. అలా ప్రేమగా పెంచుకుంటున్న ఓ కుక్క తప్పిపోయింది. అందులోనూ అది కమిషనర్ గారి కుక్క కావడంతో ఇంకేముంది హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. కుక్క ఆచూకీ కోసం నగరమంతా జల్లెడపట్టేశారు. నగరంలోని శాంభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలా శునకాలు వెతికే పనిలో మునిగిపోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. వేరే పనులన్నీ పక్కన పెట్టి మరీ నిద్రాహారాలుమాని 36 గంటలు కమిషనర్ గారి కుక్కను వెతికే పనిలోనే మునిగిపోయారు. అయినా పాపం కుక్క ఆచూకీ మాత్రం దొరకలేదట.దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింట్లో కమిషనర్ గారి కుక్క కథ వినిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఈ ఘటన జరిగింది . తప్పిపోయింది మీరఠ్ పోలీస్ కమిషనర్ సెల్వకుమారి గారి పెట్ డాగ్. తప్పిపోయింది జర్మన్ షెపర్డ్ బ్రీడ్ డాగ్. దాని పేరు ఎకో. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ డాగ్స్ సిటీలో కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ కుక్క మిస్ అయ్యిందట. దీంతో పోలీసులు వెంటనే కమిషనర్ ఇంటికి వెళ్లి ఆ చుట్టుపక్కన ప్రాంతంలోని 500లకు పైగా ఇళ్లల్లో సోదాలు చేశారట. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పోలీసులే కాదు ఆనిమల్ వెల్ఫేర్ అధికారి హర్పల్ సింగ్ సైతం కమిషనర్ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని దాని కోసం వెతుకులాట మొదలుపెట్టారట. అందుకే ఈ ఘటన వివాదాస్పదంగా మారింది.
అయితే ఈ వార్తలను పోలీసు కమిషనర్ సెల్వకుమారి కొట్టి పారేశారు. తమ కుక్క కోసం పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నా కుక్క తప్పిపోయిందని రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు. గేట్ తెరచి ఉండటం వల్ల కుక్క బయటికి వెళ్లిపోయింది. మా ఇంటికి దగ్గర్లోనే కుక్కను గమనించి ఇంటికి తీసుకువచ్చారు. అంతేకాని దాన్ని ఎవరూ దొంగిలించలేదని కమిషనర్ ట్వీట్ చేశారు.