Uniform Civil Code Bill: యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
X
పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు (UCC) ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా రూపొందించిన ఈ బిల్లును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
బిల్లు ఆమోదం పొందిన అనంతరం సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాఖండ్ చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజని చెప్పారు. యూసీసీ అమలుకు దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయని, అలాంటి ఈ బిల్లును తొలుత ఉత్తరాఖండ్ తీసుకొచ్చిందన్నారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చింది కాదన్నారు. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుందని పేర్కొన్నారు.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ బిల్లును పౌరులందరికీ వారి మతాలతో సంబంధం లేకుండా.. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం అంశాలలో ఒకే చట్టాన్ని వర్తింపజేసేలా రూపొందించారు. సహజీవనం చేసే జంటలకు ఈ బిల్లుతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.