Home > జాతీయం > కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ముఖ్యమంత్రి

కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ముఖ్యమంత్రి

కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ముఖ్యమంత్రి
X

17 రోజులుగా ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సాయంత్రం రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ కూలీల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చూపిన ధైర్యం, సంకల్పం కార్మికులకు కొత్త జీవితాలను ప్రసాదించిందంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు. కార్మికుల కుటుంబాలు చూపిన సహనం, ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ అభినందనలు తెలిపారు. మంగళవారం సాయంత్రం టన్నెల్ నుంచి విజయవంతంగా బయటికొచ్చిన ఆ 41 మందిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో కలుసుకున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకుని, ఇంతకుముందు వారికిచ్చిన మాట ప్రకారం వారికి లక్ష రూపాయల సహాయ చెక్కులను కూడా అందజేశారు.

చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశమై వారికి చెక్కులను అందజేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. నవంబర్ 28న మీడియాతో మాట్లాడిన సీఎం ధామి.. సొరంగం నుంచి రక్షించిన 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆసుపత్రి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పారు. రక్షించిన కార్మికులను ఇంటికి పంపించే ముందు వైద్యుల పరిశీలనలో ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌కు చెందిన వారు, ఇద్దరు ఉత్తరాఖండ్‌, 5గురు బీహార్‌, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌, 8 మంది ఉత్తరప్రదేశ్‌, 5గురు ఒడిశా, ఇద్దరు అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారున్నారు.

Updated : 29 Nov 2023 1:59 PM IST
Tags:    
Next Story
Share it
Top