Uttarakhand Tunnel Incident: ఉత్తరాఖండ్ సొరంగం వద్ద అదే పరిస్థితి
X
ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగి వంద గంటలు ముగిసినప్పటికీ ..లోపలి చిక్కుకున్న 40 మంది కూలీల్లో ఒక్కరూ కూడా ఇంకా బయటకు రాలేదు. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సొరంగం కుప్పకూలి 4 రోజులు గడుస్తుండడంతో అందులో చిక్కుకుపోయిన వారి ఆరోగ్యం విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నెల 12న (ఆదివారం) ఉదయం ఉత్తరకాశీలో (Uttarkashi) చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగంలో (Tunnel) కొంతభాగం కూలిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారంతా చిక్కుకుపోయారు. శిథిలాలు దాని ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరోవైపు కొందరు కార్మికులు తమ తోటి కార్మికులను త్వరగా బయటకు తీయాలంటూ ఘటనా స్థలం వద్ద ఆందోళనలు నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో గొడవకు దిగారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాళ్లు ఊరుకోలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అటు అధికారులు మాత్రం వాళ్లను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్‌లతో శిథిలాలను కట్ చేస్తున్నారు. థాయ్‌లాండ్, నార్వేకు చెందిన నిపుణుల బృందాల సహాయం కూడా తీసుకుంటున్నారు. 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలా గుండా సొరంగంలోకి పంపిస్తున్నారు. దీనిద్వారా కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.