నాగ్‌పూర్‌లో మిస్టర్ ప్రెగ్నెంట్..36 ఏళ్లుగా కడుపులో కవలలు
X
వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదైన కేసు ఇది. నిజ జీవితంలో ఓ పురుషుడు గర్భవతుడయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 ఏళ్లు ఇద్దరు కవల పిల్లలను తన కడుపులో మోశాడు మహారాష్ట్రకు చెందిన సంజు భగత్. 1999లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 'ది డైలీ స్టార్' పత్రిక దానిపై తాజా కథనం ప్రచురించింది. దీంతో ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సంజు భగత్ బానెడు పొట్టతో ఊర్లో తిరుగుతుండేవాడు. అక్కడ ఉన్నవారికంటే సంజు భగత్ కాస్త భిన్నంగా కనిపించేవాడు. తన గ్రామంలోని వారంతా ఉబ్బిన పొట్టతో ఉన్న సంజు భగత్‌ను గర్భవతి అని ఏడిపించేశారు. కానీ అవేమి అతను పట్టించుకోలేదు. దాదాపు 36సంవత్సరాలకుపైగా సంజు పొట్ట ఇలా ఉబ్బుగానే ఉండేది. అయితే రాను రాను పొట్ట మరింత పెరగడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో 1999లో ముంబయిలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లాడు. సంజును మొదట వైద్యులు చూడగానే కడుపులో ఏదైనా గడ్డ పెరిగి ఉండవచ్చని భావించారు. డాక్టర్ అజయ్ మెహతా సంజు భగత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించారు. పొట్టలో ఉన్నది చూశాక డాక్టరుకు నోట మాట రాలేదు. ఒక్కొక్కటిగా మనిషి అవయవాలు బయటకు రావడంతో వారంతా ఆశ్చర్యపోయారు. గత 36 ఏళ్లుగా సంజు భగత్ ఈ కవల పిల్లలను తన కడుపులో మోస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే వైద్య పరిభాషలో ‘‘ఫీటస్ ఇన్ ఫీటు’’ అంటే పిండంలో పిండం అని అంటారట. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసు. ఇప్పుడు సంజు భగత్ వయసు 60 ఏళ్లు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు.