Home > జాతీయం > Himachal Pradesh : హిమాచల్ సంక్షోభం..రంగంలోకి డీకే.. మంత్రి రాజీనామాలో ట్విస్ట్

Himachal Pradesh : హిమాచల్ సంక్షోభం..రంగంలోకి డీకే.. మంత్రి రాజీనామాలో ట్విస్ట్

Himachal Pradesh : హిమాచల్ సంక్షోభం..రంగంలోకి డీకే.. మంత్రి రాజీనామాలో ట్విస్ట్
X

హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందంటూ బీజేపీ ఆరోపించింది. దీనిపై గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. ఈ రాజకీయ సంక్షోభ సమయంలోనే మంత్రి విక్రమాదిత్య తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితిని చక్కబెట్టాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపేందర్ సింగ్ హుడాలను హిమాచల్ పంపించింది. వారు సిమ్లా వెళ్లిన కొద్ది గంటల్లో విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. తన రాజీనామాను సీఎం ఆమోదించలేదని.. ఈ కష్టపరిస్థితుల్లో వారిని ఇంకా ఒత్తిడి చేయదలుచుకోలేదని విక్రమాదిత్య తెలిపారు. తమ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉందని చెప్పారు. అటు సీఎం సుఖు సైతం విక్రమ్ రాజీనామాను ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు. ఇక బుధవారం అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బలం నిరూపించుకోవాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ 15మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది.

కాగా హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి.





Updated : 29 Feb 2024 8:27 AM IST
Tags:    
Next Story
Share it
Top