హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు..రిషి సునాక్
X
ఖలిస్థానీ తీవ్రవాదం అంశంపై బ్రిటన్ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ఆయన తాజాగా ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని అన్నారు రిషి సునాక్. ఈ ముప్పుకు ముగింపు కార్డు వేసేందుకు ఇరు దేశాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నాయని తెలిపారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు రిషి సునాక్ తన సతీమణితో సహా కలిసి ఇండియా వచ్చారు.
ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ.. "టెర్రరిజం, హింస ఏ రూపంలో ఉన్నా వాటికి బ్రిటన్‌లో స్థానంలేదు. అందుకే ఖలిస్థానీ మద్దతుదారుల అంశాన్ని ఓవర్‌కమ్ చేసేందుకు ఇండియాతో కలిసి పనిచేస్తున్నాం. ఈ మధ్యనే బ్రిటన్ డిఫెన్స్ మినిస్టర్ భారత్‌లో పర్యటించారు. ఈ తరహా హింసకు ముగింపు పలికేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో నేను దీనిని ఎట్టిపరిస్థితుల్లో సహించను.
ఓ హిందువుగా నేను గర్విస్తున్నాను. నేను ఓ హిందువుగానే పెరిగాను.ఇప్పటికీ అలాగే ఉన్నాను. వీలైనప్పుడల్లా దేవాలయాలకు వెళ్తాను. అంతే కాదు ఈ మధ్యనే రాఖీ పండుగను చేసుకున్నాము. ఇండియాకు రావడం పర్సనల్‌గా నాకెంతో ప్రత్యేకం, ప్రేమ. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బాధ్యతల్లో ఇండియాకు వచ్చాను. భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పచుకునే మార్గాలు కనుగొంటున్నాను. ఇక్కడ నిర్వహిస్తోన్న జీ20 సమ్మిట్ సక్సెస్ చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది" అని రిషి సునాక్ అన్నారు.