వందే భారత్ రైలును లాక్కెళ్లిన ఎలక్ట్రిక్ ఇంజిన్...రైల్వే క్లారిటీ
X
దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే వందేభారత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. వీటిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసిన సందర్భాలు అనేకం.
తాజాగా మరోసారి వందే భారత్ రైలు వీడియో వైరల్ అయ్యింది. ఓ పాత ఎలక్ట్రిక్ ఇంజిన్ వందే భారత్ రైలును తీసుకెళ్లినట్టు ఆ వీడియో కనిపించింది. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్ల వాస్తవ పరిస్థితి ఇదీ అంటూ కొందరు వీడియోను షేర్ చేశారు. వందే భారత్ మొరాయించడంతో అలా తీసుకెళ్తున్నారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కృష్ణ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘9 ఏళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళుతోంది’ అంటూ పోస్ట్ చేశారు.
ఈ వీడియోపై విమర్శలు రావడంతో ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందించింది. దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇంకా ప్రారంభం కాని వందే భారత్ రైలుని ఎలక్ట్రిక్ ఇంజిన్ తీసుకువెళ్తున్నట్టు స్పష్టం చేసింది. కొత్త ట్రైన్ కావడంతో రూట్ కూడా ఖరారు కాలేదని, దాంట్లో లోకో పైలట్లు, సిబ్బంది లేరని వివరించింది. రూట్ ఖరారు అయ్యాకనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపింది.
पीछले 9 सालों के झूठ को खींच कर ले जाता 70 सालों का इतिहास👇 pic.twitter.com/WwdCIj7cQL
— Krishna Allavaru (@Allavaru) June 29, 2023