Home > జాతీయం > హైవేపై కారు ప్రమాదం.. ఎగబడి దోచుకున్న స్థానికులు

హైవేపై కారు ప్రమాదం.. ఎగబడి దోచుకున్న స్థానికులు

హైవేపై కారు ప్రమాదం.. ఎగబడి దోచుకున్న స్థానికులు
X

కళ్లెదురుగా జరిగిన కారు ప్రమాదంలో.. ఎవరైనా గాయపడ్డారేమో అని సాయం చేయడానికి వెళ్లిన స్థానికులంతా.. ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. వారి కంటికి ప్రమాదానికి గురైనవారు కనిపించలేదు కానీ.. కారులో ఉన్న మాల్ మాత్రం కంటపడింది. ఆ సరుకును చూడగానే కొంతమందికి నోరూరింది. పంటపండింది అని మరొకరు, అదృష్టం అంటే ఇదేరా అని ఇంకొందరు.. ఇలా ప్రతీ ఒక్కరూ అందిన కాడికి దోచుకెళ్లారు. ఇంతకీ ఆ కారులో ఏముందో ఈపాటికే అర్థమై ఉంటుంది. రూ.లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు. మూడ్రోజుల క్రితం(సోమవారం) జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

బీహార్‌లోని దోభి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో నెంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న మారుతి సుజుకి విటారా బ్రీజా కారు మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో వాహ‌నాలు నిలిచిపోయి.. ట్రాఫిక్ స్తంభించింది. ఇంతలో ప్ర‌మాదానికి గురైన కారులోని వ్యక్తికి ఏమైందోనని, అతడికి సాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న వాహ‌న‌దారులు, స్థానికులంతా పరుగున ఆ కారు వద్దకు వచ్చారు. అయితే అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కంగారుగా అక్కడినుంచి పరారీ అయ్యాడు. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో అని స్థానికులంతా కారు డోర్ తెరచి చూడగా... కారులో భారీగా మ‌ద్యం బాటిల్స్ క‌నిపించాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే మంచి ఛాన్స్‌గా భావించి మ‌ద్యం బాటిళ్ల‌ను ఎగ‌బ‌డి ఎత్తుకెళ్లారు. కారు డిక్కీలో కాటన్ బాక్సుల్లో ఉన్న మద్యం బాటిళ్లను అందికాడికి దోచుకున్నారు. ఈ ఘటన గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అయితే, అప్ప‌టికే అంతా అయిపోయింది. అసలు అందులో మద్యం బాటిళ్లు ఉన్నాయన్న జాడ కూడా లేకుండా సాంతం దోచుకెళ్లారు.

కారులో ఖరీదైన విదేశీ మ‌ద్యం సీసాలు ఉన్నాయని, వాటన్నింటిని ఎత్తుకుపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బిహార్‌లో 2016 నుంచి మ‌ద్య నిషేధం కొన‌సాగుతోంది. దీంతో అక్రమంగా ఎవరైనా మద్యం అమ్మినా, సరఫరా చేసిన కేసులు ఎదుర్కొవాల్సిందే. ఈ నేపథ్యంలో మద్యం తీసుకొస్తుండగా కారు ప్రమాదానికి గురికావడం వల్ల భయంతో డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. కొందరు ద్విచక్రవాహనాలు, కార్లు దిగి మద్యం బాటిళ్లను దోచుకుపోవడం గమనార్హం. ఈ తతంగాన్ని అక్కడున్నవారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఎక్సైజ్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. వీడియోలోని వ్యక్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.



Updated : 2 Nov 2023 8:35 AM IST
Tags:    
Next Story
Share it
Top